ఇల్లు వాకిలి వదిలి వెళ్లిన ఎంతో మంది కథల్ని చదివాను, రోమాలు నిక్కపొడుచుకునేవి. అలాంటి ఒక రోజు నా జీవితంలో కూడా వచ్చింది. అది ఈ రోజే August 6, 2026.
రోమాలు నిక్కపొడుచుకోలేదు, కళ్లల్లో నీళ్లు తిరిగాయి, తిరుగుతూనే ఉన్నాయి. దారి పొడవునా కన్నీళ్లే,
"మళ్లీ మా అమ్మను చూస్తానో లేదో, నా తమ్ముడు, అక్క, వారి పిల్లలు, వాళ్ళ విజయాల్ని చూస్తానో లేదో, చరమాంకంలో ఉన్న నా పప్పీని (My pet dog) చూస్తానో లేదో, నాకెంతో ఇష్టమైన నా మోటార్‌సైకిల్ రైడింగ్ చేయలేనేమో, నా స్నేహితులు..."
ఇవన్నీ మనసును సుడిగుండంలా చుట్టేస్తున్నాయి.
ఆత్మహత్య అయితే చేసుకోవట్లేదు. శ్రీలంక లో బౌద్ధ సన్యాసిని కాబోతున్నాను.
కొన్ని దశాబ్దాల క్రితం తమ్ముడు ఇంటర్మీడియట్ తిరుపతిలో చదువుతున్నప్పుడు తనని చూడడానికి వెళ్లొస్తున్నప్పుడు కలిగిన బాధ లాంటి బాధ, గుండెల్ని పిండేసే బాధ.
కొన్ని ప్రయాణాలు చాలా బాధిస్తాయి, కానీ తప్పదు. ఎన్నో సార్లు ఇంటి నుండి బయలుదేరాను, కొన్నిసార్లు ఒకటిన్నర సంవత్సరం పాటు ఇంటి మొహం చూడకుండా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి, అయినా ఈ ప్రయాణం
నన్ను, నా లోకాన్ని, నన్ను ప్రేమించే వాళ్ళని ఎంతగానో బాధిస్తోంది.
ఇంత వరకూ మా అమ్మ, అక్కకు నా ఈ సన్యాసం వైపు ప్రయాణం గురించి చెప్పలేదు. ఇంకా ధైర్యం సరిపోవట్లేదు. మాల్దీవులకు ఉద్యోగానికి వెళ్తున్నానని అబద్దం చెప్పాను. ఈ అబద్ధాన్ని చాలామందికి చాలా రోజులు చెప్పడం చాలా కష్టంగానే ఉన్నింది. అయినా తప్పలేదు. ఇతరుల సలహాలు, సూచనలు వినాలనిపించలేదు. ఈ నిర్ణయం ఆవేశంలో తీసుకున్నది కాదు.
గతంలో నేనొక ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక స్వామీజీ అన్నాడు, "నీకు చచ్చిపోవాలనిపించినప్పుడు చచ్చిపో. ఇన్ని నాళ్లు నువ్వు జీవించిన మనిషిగా చచ్చిపో, ఆశ్రమ జీవితంలో కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ఆరంభించు" అని.
పేరు మార్చుకున్నంత మాత్రాన, ఇల్లు వాకిలి వదిలేసినంత మాత్రాన, దుస్తులు మార్చుకున్నంత మాత్రాన, అందులో ఉన్న మనిషి, మనిషి లోని ఆలోచనలు మారిపోతాయి అని కాదు. ఇక్కడ క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యడం వలన మార్పు రావచ్చు, నిన్ను నువ్వు అంతరాంతరాల్లోనికి వెళ్లి దేనికోసం వెంపర్లాడి ఏం సాధించగలవో అర్థం చేసుకోగలవనిపిస్తుంది.
ఐదు సంవత్సరాల శిక్షణ తర్వాతే బయటికి ప్రయాణం చేసే అవకాశం. ఇక ఫోన్ ఉండదు. మీ కష్టసుఖాల్లో నేను ఇక తోడుగా ఉండలేకపోతున్నందుకు క్షమించండి.
Comments
Post a Comment